న్యూఢిల్లీ : చలనచిత్ర పరిశ్రమకు పెనుముప్పుగా మారిన డిజిటల్ పైరసీని అరికట్టేందుకు కేంద్రం చర్యలను ప్రారంభించింది. ప్రస్తుతమున్న చట్టాలను సవరించింది. తద్వారా అక్రమంగా, అనధికారికంగా చిత్రాన్ని రికార్డు చేసినా, ప్రసారం చేసినా జైలు శిక్షతో పాటు ఆ చిత్ర నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానాను విధిస్తారు. చిత్రాల పైరసీకి వ్యతిరేకంగా నిబంధలను కఠినతరం చేయడానికి రెండేండ్ల క్రితం సినిమాటోగ్రఫీ చట్టంలో కేంద్రం మార్పులు తెచ్చింది.
ఆ సవరణల ప్రకారం పైరసీకి కనీసం మూడు నెలల జైలు శిక్షతో పాటు 3లక్షల జరిమానా విధిస్తారు. అయితే సవరించిన చట్టం ప్రకారం దీనిని మూడేండ్ల వరకు పొడిగింపు లేదా మొత్తం చిత్ర నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానాగా విధించవచ్చునని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మురుగన్ పార్లమెంట్‌కు తెలిపారు. పైరసీ కారణంగా చలనచిత్ర పరిశ్రమకు 2023లో రూ.22,400 కోట్ల నష్టం వాటిల్లింది.