e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home Top Slides ఇద్దరంటే ఇద్దరే!

ఇద్దరంటే ఇద్దరే!

  • టూ చైల్డ్‌ పాలసీ అమలుకు యూపీ సమాయత్తం
  • జనాభా నియంత్రణ బిల్లును రూపొందించిన యూపీ లా కమిషన్‌
  • జూలై 19 వరకు అభిప్రాయ సేకరణ.. అనంతరం అసెంబ్లీలో బిల్లు
  • నిబంధనలు పాటించకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ఎన్నికలకు అనర్హులు
  • పాటించేవారికి ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలు, రాయితీలు
  • ముస్లింలను లక్ష్యంగా చేసుకునే బిల్లు తెచ్చారని ఎస్పీ నేతల ఆరోపణ

దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉన్నది. తాజా అంచనా ప్రకారం ఆ రాష్ట్ర జనాభా 24.1 కోట్లు

లక్నో, జూలై 10: జనాభాను కట్టడి చేసేందుకు బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ కీలక చర్యలు చేపట్టింది. గరిష్ఠంగా ‘ఇద్దరు పిల్లల’ నిబంధనతో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సమాయత్తమైంది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాలు అందకుండా కఠిన ఆంక్షలు ప్రతిపాదించింది. అలాగే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకుండా నిబంధనలు పొందుపరిచింది. ఈ మేరకు ‘ఉత్తరప్రదేశ్‌ జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు, 2021’ను ఆ రాష్ట్ర లా కమిషన్‌ (యూపీఎస్‌ఎల్‌సీ) వెబ్‌సైట్‌లో తాజాగా విడుదల చేసింది.

- Advertisement -

ఏమిటీ ఈ బిల్లు?
రాష్ట్రంలో జనాభాను నియంత్రించడమే లక్ష్యంగా యూపీ సర్కారు ఈ బిల్లు తీసుకొచ్చింది. గరిష్ఠంగా ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను పాటిస్తూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న వారికి ఉద్యోగం, సంక్షేమ పథకాల్లో ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈ బిల్లుపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించే గడువు చివరి తేదీని జూలై 19గా నిర్ణయించారు. ఆదివారం యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ అధికారికంగా ఈ బిల్లును విడుదల చేయనున్నారు. వచ్చేనెల రెండో వారంలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.

ఎందుకు ఈ బిల్లు?
పరిమితంగా ఉన్న సహజ, ఆర్థిక వనరులను ప్రజలందరికీ అందించడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు యూపీ సర్కారు పేర్కొంది. అందరికీ తిండి, తాగునీరు, ఇండ్లు, విద్య, వైద్య సేవలు అందించాలంటే ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న జనాభాను నియంత్రించాలని తెలిపింది.

ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే?
ప్రతిపాదిత బిల్లు అమల్లోకి వస్తే.. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుండదు. ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. ఒకవేళ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులైతే భవిష్యత్తులో ప్రమోషన్లు ఇవ్వరు. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందవు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. రేషన్‌ కార్డులో నలుగురు వ్యక్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రచారానికి ఫండ్‌‘ఇద్దరు పిల్లల’ నిబంధన విస్తృతంగా ప్రచారం చేయడానికి యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘స్టేట్‌ పాపులేషన్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేయనున్నది.సెకండరీ స్కూళ్లలో జనాభా నియంత్రణపై ఒక సబ్జెక్టును ప్రవేశపెట్టనున్నారు.

బిల్లుపై విమర్శలు
ముస్లింల జనాభాను నియంత్రించడానికే ఈ బిల్లును ప్రతిపాదించినట్టు ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్‌ మహమ్మూద్‌ ఆరోపించారు. పిల్లలు ఉండి విడాకులు తీసుకున్న మహిళలు/భర్త కోల్పోయి రెండో పెండ్లి చేసుకున్న మహిళలపై ఈ బిల్లు ప్రభావం చూపిస్తుందని విమర్శలు వస్తున్నాయి.

చైనా పాఠాలు మరువొద్దు!
దేశంలో జనాభా పెరుగుతుండటంతో 1979లో ‘ఇద్దరికి ఒక్కరే’ నినాదంతో చైనా ‘వన్‌ చైల్డ్‌ పాలసీ’ని తీసుకొచ్చింది. అయితే కాలక్రమేణా వృద్ధ జనాభా పెరిగిపోవడం, యువ జనాభా తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం మొదలైంది. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన డ్రాగన్‌.. 2015లో ఆ నిబంధనను ఎత్తేసింది. దాని స్థానంలో ‘ఇద్దరికి ఇద్దరు’ పాలసీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నిబంధనను కూడా ఎత్తేసే యోచనలో ఉంది.

పాటిస్తే ప్రోత్సాహకాలు..
‘ఇద్దరు పిల్లల’ నిబంధన పాటించేవారికి ప్రోత్సాహకాలు అందించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకైతే సర్వీసు మొత్తంలో రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. ప్రసూతి/పితృత్వ సెలవులు 12 నెలలు ఇస్తారు. ఈ కాలంలో పూర్తి వేతనాన్ని, ఇతర అలెవెన్సులను అందిస్తారు. ఇల్లు లేదా ప్లాట్‌ కొనాలనుకుంటే వారికి సబ్సిడీ అందిస్తారు. ఇంటి పన్ను, నీటి పన్ను, విద్యుత్‌ చార్జీల్లో కూడా కొన్ని మినహాయింపులు ఇవ్వనున్నారు. ఒక్కరే సంతానం ఉన్నవారికి మరిన్ని సదుపాయాలు లభించనున్నాయి.

అస్సాంలోనూ..
‘ఇద్దరు పిల్లల నిబంధన’ బిల్లును వచ్చే నెల అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు అస్సాం ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలకు ఇద్దరు సంతానం కలిగినవారే అర్హులని ఈ బిల్లులో పలు నిబంధనలు చేర్చారు.

ఆదిత్యనాథ్‌ మిట్టల్‌
యూపీ లా కమిషన్‌ చైర్మన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana