ఆజమ్‌ఘర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 25 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి యాసిడ్‌తో దాడి(Acid Attack) చేశాడు. ఆ దాడిలో ఆమె ముఖం, భుజం, మెడ, శరీర పైభాగం తీవ్రంగా కాలాయి. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన యూపీలోని మౌ జిల్లాలో జరిగింది. రీమాకు ఇటీవలే పెళ్లి ఫిక్సైంది. ఆ పెళ్లి కోసం ఆమె ఏర్పాట్లు చేసుకుంటోంది. ఖర్చుల కోసం బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకువస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. దాంట్లో ఓ వ్యక్తి యాసిడ్ తీసి ఆమెపై చల్లాడు.
నువ్వు నాకు దక్కకుంటే, ఇంకెవ్వరికీ దక్కవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. నిందితుడిని రామ్ జనమ్ సింగ్ పటేల్‌గా గుర్తించారు. అతను రిమాతో కొన్నాళ్లు రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరో వ్యక్తితో పెళ్లి కుదుర్చుకోవడాన్ని అతను వ్యతిరేకించాడు. మే 27వ తేదీన రీమా పెళ్లి జరగాల్సి ఉన్నది. యాసిడ్ దాడితో తీవ్ర గాయాలైన ఆమెను ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించారు.
ఆజమ్ఘర్లోని గ్లోబల్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేస్తున్నారు. నిందితుడు పటేల్‌తో పాటు మరో బైకర్‌ను అరెస్టు చేశారు. దాడికి వాడిన బైక్‌ను కూడా సీజ్ చేశారు. నేరాన్ని అంగీకరించిన నిందితుడు.. తాను కేవలం రీమా వెనుక భాగంలో యాసిడ్ చల్లాలనుకున్నట్లు చెప్పాడు. ఒకవేళ ఆమె పెళ్లి ఆగిపోతే అప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు అన్న ఉద్దేశాన్ని అతను వ్యక్తం చేశాడు.