లక్నో: ఒక డాక్టర్ తన భార్యను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గుట్టుగా దహనం చేశాడు. ఆమె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ డాక్టర్‌తోపాటు సహకరించిన అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఈ సంఘటన జరిగింది. 2014లో లఖింపూర్ నగరంలోని మొహల్లా బహదూర్నగర్కు చెందిన డాక్టర్ అభిషేక్ అవస్థితో ఆయుర్వేద వైద్యురాలైన వందనా శుక్లాకు పెళ్లి జరిగింది. సీతాపూర్ రోడ్లో గౌరీ చికిత్సాలయ అనే ఆసుపత్రిని ఈ జంట నిర్వహిస్తున్నది.
కాగా, కొంతకాలంగా ఆ దంపతుల మధ్య వైవాహిక వివాదాలు మొదలయ్యాయి. దీంతో చమల్పూర్లోని లక్ష్మీ నారాయణ్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేయాలని వందన నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 26న ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన అభిషేక్ సుత్తితో భార్య తలపై కొట్టగా ఆమె చనిపోయింది. అనంతరం భార్య మృతదేహాన్ని సూట్కేట్లో ఉంచి తనతోపాటు క్లీనిక్‌కు తీసుకెళ్లాడు. ఒక అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. ఒక మహిళ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని, అత్యవసరంగా దహనం చేయాల్సి ఉందని డ్రైవర్‌తో చెప్పాడు. భార్య మృతదేహాన్ని ఆ అంబులెన్స్‌లో 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న గఢ్ ముక్తేశ్వర్‌లోని గంగా నది ఒడ్డుకు తీసుకెళ్లి అక్కడ దహనం చేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదని, ఇంట్లోని కొన్ని విలువైన వస్తువులు కూడా మాయమయ్యాయంటూ పోలీసులకు మరునాడు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ వందన మిస్సింగ్‌పై దర్యాప్తు చేపట్టారు. ఆమె భర్త అభిషేక్‌పై అనుమానం వ్యక్తం చేసి అతడిపై నిఘా పెట్టారు. కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అతడ్ని ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేసిన డాక్టర్ అభిషేక్‌తోపాటు సహకరించిన అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.