తిరువనంతపురం: రద్దీ ప్రాంతంలోని రెస్టారెంట్ బయట బైక్‌పై వదిలేసిన బ్యాగ్ నుంచి బీప్ శబ్దం వినిపించింది. దీంతో బాంబుగా అనుమానించిన అక్కడి వారు భయాందోళన చెందారు. (beeping electronic device) పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. బ్యాగు లోపలున్న హెల్మెట్‌లో అమర్చిన ఎలక్ట్రానిక్ పరికరం నుంచి బీప్ శబ్దం వచ్చినట్లు గుర్తించారు. అయితే అది బాంబు కాదని నిర్ధారించారు. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో కక్కనాడ్ ఇన్ఫోపార్క్ సమీపంలోని జన సందడి ఉన్న రెస్టారెంట్ బయట సిబ్బంది పార్క్ చేసిన బైక్‌పై ఒక బ్యాగ్ కనిపించింది.
కాగా, గమనించిన ఆ వ్యక్తి ఆ బ్యాగ్ ఎవరిది అని అక్కడున్న వారిని అడిగాడు. ఎవరూ స్పందించకపోవడంతో రెస్టారెంట్ యజమానికి ఈ విషయం చెప్పాడు. దీంతో వారు ఆ బ్యాగ్‌ను పరిశీలించగా లోపల నుంచి బీప్ సౌండ్ వినిపించింది. ఈ నేపథ్యంలో బాంబుగా అనుమానించిన వారంతా భయాందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. బ్యాగ్‌లో ఉన్న హెల్మెట్ లోపల ఎలక్ట్రానిక్ పరికరం అమర్చి ఉండటాన్ని గమనించారు. దాని నుంచి బీప్ శబ్దం వచ్చినట్లు గ్రహించారు. అయితే అది బాంబు కాదని నిర్ధారించారు. భయాన్ని రేకెత్తించేందుకు ఎవరైనా ప్రయత్నించారా? లేక ఏదైనా బ్లాస్ట్ ప్లాన్ కోసం ముందుగా రిహార్సిల్స్ చేశారా? అన్న కోణాల్లో పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ బ్యాగ్‌ను అక్కడ ఎవరు వదిలేశారు? ఎందుకు? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.