తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురంలో కేంద్ర మంత్రి వి. మురళీధరన్ నివాసంపై గురువారం ఉదయం దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో మంత్రి నివాసంలోని పార్కింగ్ ప్రదేశంలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని మురళీధరన్ కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. మంత్రి కార్యాలయ ఉద్యోగులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు.
ఘటనా స్ధలంలో రక్తం మరకలు గుర్తించామని పోలీసులు తెలిపారు. దాడి చేసిన వారిని గుర్తించేందుకు వారు ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారో నిగ్గుతేల్చేందుకు విచారణ చేపట్టామని పోలీసులు వెల్లడించారు. మంత్రి నివాసంలో పనిచేసే మహిళ ఉదయాన్నే అక్కడకు రావడంతో దాడి విషయం వెల్లడైందని చెప్పారు.
ఇది దోపిడీ దొంగల పని కాదని ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడేనని అనుమానిస్తున్నామని వలంటీర్ బాలు పేర్కొన్నారు. ఇంట్లోకి చొరబడేందుకు దుండగులు ప్రయత్నించలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని చెప్పారు.