న్యూఢిల్లీ: రూ.50 లక్షలు చెల్లించాలంటూ రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ మొబైల్ ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి శనివారం సందేశం రావటం కలకలం రేపింది. మూడు రోజుల్లో డబ్బులు పంపకపోతే..తీవ్ర పరిణామాలుంటాయని కొందరు ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు.
తన మొబైల్‌కు బెదిరింపులు రావటం నిజమేనని, దీనిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారని సంజయ్ సేథ్ మీడియాకు తెలిపారు. రాంచీలోని కాంకే నుంచి ఈ బెదిరింపు సందేశం వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు ప్రధాని మోదీని అంతమొందించేందుకు ఇద్దరు ఐఎస్ఐ ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడుతున్నారంటూ శనివారం ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఓ సందేశం వచ్చింది. రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి ఈ బెదిరింపు వచ్చిందని పోలీసులు చెప్పారు.