న్యూఢిల్లీ: భిన్నాభిప్రాయాలను సహించడమే ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పరీక్ష అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. పాలకుడు తనకు వ్యతిరేకంగా ఉన్న బలమైన అభిప్రాయాన్ని కూడా సహించగలడని, అది ఆత్మ పరిశీలనకు కూడా దారి తీస్తుందని ఆయన అన్నారు. పుణెలోని ఎంఐటీ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు, మేధావులు నిర్భీతిగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరారు.
మన దేశంలో అభిప్రాయ భేదాల సమస్య లేదు కాని, అభిప్రాయ లోపం సమస్య ఉందని అన్నారు. మనం లెఫ్టిస్టులమో, రైటిస్టులమో కాదని, అవకాశవాదులమని, అందుకే రచయితలు, మేధావుల నుంచి ఎలాంటి భయం లేకుండా అభిప్రాయాలను ఆశిస్తున్నామని అన్నారు. ఎప్పుడైతే సమాజంలో అస్పృశ్యత, సాంఘిక న్యూనత, ఆధిక్యత భావనలు కొనసాగుతాయో అప్పుడు దేశ నిర్మాణం పూర్తవుతుందని చెప్పలేమని అన్నారు.