బెంగళూరు: కర్ణాటకలోని చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలో కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారు. (HD Kumaraswamy’s Son Loses) ఆ రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్)కు చెందిన ఆయన 25,413 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సీపీ యోగేశ్వరా చేతిలో పరాజయం పొందారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు, నటుడి నుంచి రాజకీయవేత్తగా మారిన నిఖిల్ కుమారస్వామికి 87,229 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన యోగేశ్వరాకు 1,12,642 ఓట్లు వచ్చాయి. దేవెగౌడ, బీఎస్ యడ్యూరప్ప సహా బీజేపీ, జేడీ(ఎస్) నేతలు చన్నపట్నలో నిఖిల్ తరఫున ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
కాగా, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై కుమారుడు, బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మై కూడా షిగాగావ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. సండూర్ సీటులో కూడా కాంగ్రెస్ గెలిచింది. దీంతో కర్ణాటకలో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అన్నింటా విజయం సాధించింది.