న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ గిరిజనులను మరోసారి మోసం చేసింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు ఇప్పుడు కుదరదు అని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కేసులు పరిష్కారం అయిన తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పింది. ఈ విషయాన్ని కేంద్రం లోక్సభలో తెలిపింది.
లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందినట్లు మంత్రి అర్జున్ ముండా చెప్పారు. గిరిజన రిజర్వేషన్లను 10 శాతం వరకు పెంచాలని కోరూతూ తెలంగాణా ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోం శాఖకు చేరిందన్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. అత్యున్నత న్యాయస్థానంలో కేసులు పరిష్కారం తరువాత దీనిపై ముందకు వెళ్లాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం శాఖ తెలిపిందని అర్జున్ ముండా పేర్కొన్నారు. గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల నోటిఫికేషన్ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే.