లక్నో, ఆగస్టు 23: కేంద్ర మంత్రి, బీజేపీ నేత అజయ్ మిశ్రా రైతులను ఉద్దేశించి పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోడ్డు వెంట పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయని, తాను వాటిని పట్టించుకోనని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గం లఖింపూర్ ఖీరీలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో అజయ్‌మిశ్రా మాట్లాడిన మాటలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత ఏడాది అక్టోబర్‌లో లఖింపూర్ ఖీరీలో రైతులను తొక్కించి చంపిన ఘటనలో అజయ్‌మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. బాధిత రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని, కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను తప్పించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు తాజాగా మూడు రోజుల పాటు లఖింపూర్‌లో మహాధర్నా నిర్వహించాయి.
ఆ ప్రశ్నలకు మాత్రం సైలెంట్..
రైతుల ఆందోళన తర్వాత అజయ్‌మిశ్రా లఖింపూర్‌లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ‘నేను కారులో వేగంగా లక్నోకు వెళ్తున్నానని అనుకోండి.. కుక్కలు మొరుగుతాయి. మొరగడంతో పాటు కారు వెంట కూడా పడుతాయి. అది వాటి సహజ స్వభావం. వాటి గురించి నేనేం చెప్పలేను. అటువంటి స్వభావం మనకు లేదు’ అని అన్నారు. అశిష్ మిశ్రా గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం అజయ్‌మిశ్రా నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. మీడియా, రైతులుగా చెప్పుకునే వారు, కెనడా, పాకిస్థాన్‌లో కూర్చొన్న జాతీయేతర రాజకీయ పార్టీలు, ఉగ్రవాదులు.. వీరంతా ఇంత పాపులర్ చేస్తారని నేను ఎన్నడూ అనుకోలేదని పేర్కొన్నారు. వీరి వలన ప్రజలు తనను ఎలా ఓడించాలో ఎన్నటికీ తెలుసుకోలేరని ఎగతాళి చేశారు. ఏనుగు తన దారిన తాను వెళ్తుందని, కుక్కలే ఎప్పుడూ మొరుగుతుంటాయని వ్యంగ్యంగా మాట్లాడారు.
ఎంతమంది టికాయిత్లు వచ్చినా..
రైతు నేత రాకేశ్ టికాయిత్‌ను కూడా టార్గెట్‌గా చేసుకొని అజయ్ మిశ్రా పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఎంతమంది రాకేశ్ టికాయిత్లు వచ్చినా మనల్ని ఏం చేయలేరు. అతనో చౌకబారు మనిషి. రెండుసార్లు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి’ అన్నారు. కాగా, లఖింపూర్‌లో గూండారాజ్యం నడుస్తున్నదని టికాయిత్ మండిపడ్డారు.