న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’తో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా మహమ్మారి కట్టడికి పలు సూచనలు చేసిన ఆయన.. వాటిని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు పరీక్షలు వేగవంతం చేసి, సరైన సమయంలో గుర్తించడం, కంటైన్మెంట్ జోన్లను సిద్ధం చేయాలన్నారు. అన్ని స్థాయిల్లో నిఘా పెంచాలని, హాట్స్పాట్లపై నిఘా పెంచాలని సూచించారు.
టీకాల కవరేజీ పెంచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా మహమ్మారిని కట్టడి చేయవచ్చన్నారు. ఆర్టీ పీసీఆర్, ర్యాట్ పరీక్షల ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించవచ్చని రాజేశ్ భూషణ్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, హోం క్వారంటైన్‌పై నిఘా పెంచాలని సూచించారు.