Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఉపాధి కల్పన, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ రూ.3లక్షల కోట్లకుపైగా విలువైన చారిత్రాత్మక కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ్ మీడియాతో మాట్లాడుతూ, ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం, పరిశోధన అభివృద్ధి-ఆవిష్కరణ (RDI) పథకం, జాతీయ క్రీడా విధానం-2025, తమిళనాడులో పరమకుడి-రామనాథపురం జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడానికి ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకున్న ఈ నాలుగు ప్రధాన నిర్ణయాలు యువతకు సాధికారత కల్పించడం, ఆవిష్కరణకు దన్నుగా నిలువడం, క్రీడాకారులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. తయారీ రంగంలో ఉపాధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్న ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం మొత్తం రూ. 1.07 లక్షల కోట్ల వ్యయంతో అమలు చేరయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో రెండు భాగాలున్నాయని చెప్పారు. కొత్తగా ఉద్యోగ అవకాశాలను సృష్టించే యజమానులకు ప్రోత్సాహకాలు ఉంటాయని.. దీర్ఘకాలిక శ్రామికశక్తిని కొనసాగించే వ్యాపారులకు ప్రతిఫలం ఇవ్వడం ద్వారా స్థిరమైన ఉపాధికి మద్దతు ఇస్తుందన్నారు.
గత కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉండే సమగ్ర ప్యాకేజీ అని తెలిపారు. ఈ పథకం భారత దేశ తయారీ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వృద్ధి ఇంజిన్‌గా ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి చెప్పారు. రూ.లక్ష కేటాయింపుతో పరిశోధన అభివృది-ఆవిష్కరణ పథకం భారత్‌లో బలమైన ఆవిరష్కరణ పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు ఉద్దేశించిందని చెప్పారు. ఇంటర్నేషనల్ రోడ్ మ్యాప్ ఆధారంగా రూపొందించామన్నారు. ఇజ్రాయెల్, అమెరికా, సింగపూర్, జర్మనీ వంటి దేశాల్లో విజయవంతమైన నామూనాలను అధ్యయనం చేసిన తర్వాత అనుసంధన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF) తీసుకువచ్చినట్లు తెలిపారు. పరిశోధన ఆలోచనలను స్పష్టమైన ఉత్పత్తులుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
వ్యూహాత్మక-అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఆవిష్కరణలను వేగంగా ట్రాక్ చేయడానికి విద్యావేత్తలు, స్టార్టప్‌లు, పరిశ్రమల మధ్య సహకారాన్ని ఆర్డీఐ పథకం ప్రోత్సహిస్తుందని చెప్పారు.
గత దశాబ్దంలో భారతదేశ క్రీడా రంగం అద్భుతమైన వృద్ధిని కనబరుస్తుందని.. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ జాతీయ క్రీడా విధానం 2025కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు ప్రతిభను పెంపొందించడం, కోచింగ్‌కు ప్రాప్యతను మెరుగుపరచడం, దేశ క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం పాలసీ లక్ష్యమని పేర్కొన్నారు. క్రీడల్లో యువ అథ్లెట్లు ప్రపంచ వేదికపై పోటీపడి విజయం సాధించేందుకు క్రీడా పాలసీ అవకాశం కల్పిస్తుందన్నారు.
దక్షిణ భారతదేశంలో మౌలిక సదుపాయాలకు పెద్ద ప్రోత్సాహకంగా, తమిళనాడులోని జాతీయ రహదారిలోని పరమకుడి-రామనాథపురం సెక్షన్‌ను నాలుగు లేన్లుగా మార్చడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 46.7 కిలోమీటర్ల రోడ్డును రూ.1,853 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే పంబన్ వంతెన దగ్గర డబుల్ లైన్ రహదారి ఉందని.. ధనుష్కోడి వరకు సముద్ర తీరానికి సంబంధించిన డీపీఆర్ కూడా జరుగుతోందని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని.. ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని.. రామనాథపురం ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందన్నారు.