Gujarat | అహ్మదాబాద్, జూలై 11: బీజేపీ పాలిత గుజరాత్లో ఓ ప్రైవేటు కంపెనీ నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూకు నిరుద్యోగులు పోటెత్తారు. 10 పోస్టులను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించగా దాదాపు 1,800 మంది వరకు తరలివచ్చారు. అభ్యర్థులు బారులు తీరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకాలంగా బీజేపీ చెప్తున్న గుజరాత్ మాడల్ ఇదేనా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
థెర్మాక్స్ గ్లోబల్ అనే సంస్థ మంగళవారం అంక్లేశ్వర్‌లోని ఓ హోటల్లో హాల్‌ను అద్దెకు తీసుకొని ఇంటర్వ్యూలు నిర్వహించింది. దీని గురించి ముందుగానే పేపర్లలో ప్రకటన ఇచ్చింది. దీంతో వందల మంది అభ్యర్థులు హోటల్ ముందు బారులు తీరారు. అభ్యర్థుల మధ్య తోపులాటతో హోటల్ రెయిలింగ్ ఊడిపోయి పలువురు కింద పడిపోయారు.
గుజరాత్ మాడల్ బట్టబయలైందని కాంగ్రెస్ విమర్శించింది. నరేంద్ర మోదీ ఈ నిరుద్యోగ నమూనానే దేశమంతా రుద్దుతున్నారని పేర్కొన్నది. దీనికి బీజేపీ గుజరాత్ శాఖ కౌంటర్ ఇచ్చింది. ఈ కంపెనీ ఇంటర్వ్యూలకు పిలిచిన ప్రకటనలోనే అనుభవం కలిగిన వారికి మాత్రమే అని స్పష్టంగా పేర్కొన్నదని, కాబట్టి వచ్చిన అభ్యర్థులంతా నిరుద్యోగులు కాదని ‘ఎక్స్’లో చెప్పుకొచ్చింది.