చెన్నై, మే 12 : తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంగళవారం అసెంబ్లీలో తన సనాతన ధర్మ వ్యతిరేక వాదనను పునరుద్ధరించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపును ఆయన పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమక్షంలో సభను ఉద్దేశించి ఉదయనిధి ప్రసంగిస్తూ ప్రజలను విభజించిన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. కాగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా 2023లో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మతస్తులపై విద్వేష ప్రసంగంగా పరిగణిస్తున్నట్లు మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ కొన్ని నెలల క్రితం అభిప్రాయపడిన నేపథ్యంలో ఉదయనిధి నుంచి మళ్లీ అవే వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం.
2023 సెప్టెంబర్ 2న అప్పటి తమిళనాడు యువజన సంక్షేమ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన నిర్మూలన సదస్సులో ప్రసంగించడంతో ఈ వివాదం మొదలైంది. ఆయన సనాతన ధర్మాన్ని దోమలు, డెంగీ, మలేరియా, కరోనాలతో పోల్చి దానిని కేవలం వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని అన్నారు. ఆ తర్వాత ఆయన తన వాదనను మరింత గట్టిగా సమర్థించుకుంటూ సనాతన ధర్మం కులం, మతం పేరిట ప్రజలను విభజిస్తుందని పేర్కొన్నారు. మానవత్వం, సమానత్వం కోసం సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో పెకిలించడం అవసరమని ఆయన చెప్పారు.