Today History: తన దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముకం చేసేందుకు స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో యువకులు తమ ప్రాణాలను అర్పించారు. అటువంటి వారిలో ఒకరు విప్లవకారుడు ఉధమ్ సింగ్. 1940 లో సరిగ్గా ఇదే రోజున జలియన్‌వాలాబాగ్ మారణకాండకు పాల్పడిన బ్రిటిష్ అధికారిని తుపాకీతో కాల్చి చంపాడు. నేటి యువతరాన్ని ప్రభావితం చేసిన దేశానికి చెందిన గొప్ప విప్లవకారులలో సర్దార్ ఉధమ్ సింగ్ ఒకరు. హక్కుల కోసం పోరాడాలని, బలవంతంగా లాక్కోవాలని నమ్మిన ఆయన విప్లవాత్మక ఆలోచనలే ఇందుకు కారణం.
పంజాబ్ సంగ్రూర్ జిల్లా పరిధిలోని సునామ్ అనే గ్రామంలో ఓ సాధారణ కార్మిక కుంటుంబంలో 1899 డిసెంబర్ 26 న ఉధమ్‌సింగ్ జన్మించాడు. తల్లి బాల్యంలోనే మరణించింది. తండ్రి, సోదరులతో కలిసి అమృత్‌సర్‌కు వచ్చాడు. కొన్నేండ్లకు తండ్రి కూడా చనిపోయాడు. దాంతో ఉధమ్ సింగ్ చాలా రోజుల పాటు అనాథ శరణాలయంలో గడిపాడు.
పంజాబ్ అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో 1919 ఏప్రిల్ 13 న నిరాయుధులైన భారతీయులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపించి వందలాది మంది మరణాలకు కారణమయ్యాడు పంజాబ్ గవర్నర్‌గా ఉన్న బ్రిటిష్ అధికారి మైఖేల్ ఓడ్వైర్. ఈ ఊచకోతతో తీవ్రంగా ప్రభావితమైన ఉధమ్‌సింగ్ మైఖేల్ ఓ డ్వైర్‌ను చంపడం ద్వారా జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారం తీర్చుకోవాలని పథకరచన చేశాడు. ఇందుకోసం లండన్ వెళ్లాడు. అక్కడి కాక్స్టన్ హాల్లో ఓ సమావేశంలో ఉండగానే మైఖేల్ ఓడ్వైర్‌ను కాల్చి చంపేశాడు. అనంతరం అక్కడి పోలీసులు ఉధమ్సింగ్ను అరెస్ట్ చేసి కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా.. 1940 జూలై 31 న ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ బూర్గుల రామకృష్ణారావు జయంతి