గోరఖ్‌పూర్: భర్తలు తాగుబోతులు. దీంతో వాళ్ల భార్యలకు విసుగెత్తింది. ఇండ్లను వదిలి వెళ్లారు. ఒకర్ని ఒకరు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు మహిళలు. ఈ ఘటన యూపీ(Uttar Pradesh)లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. కవిత అనే ఓ మహిళ.. గుంజా అలియాస్ బబ్లూ అనే మరో మహిళను పెళ్లాడింది. డియోరియోలో ఉన్న చోటీ కాశీ శివాలయంలో ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ ఇద్దరు మహిళల మధ్య పరిచయం ఏర్పడింది. అయితే భర్తలు తాగుబోతులు కావడంతో.. ఆ ఇద్దరు చాలా దగ్గరయ్యారు. తాగుబోతు భర్తల వల్ల ఇద్దరూ గృహహింసకు గురయ్యారు. ఆ బాధలు తట్టుకోలేక .. తమ మధ్య ఉన్న పరిచయాన్ని పరిణయంగా మార్చుకున్నారు.
గుంజా అనే మహిళ.. పెళ్లి కుమారుడిలా మారింది. కవిత నుదిటిపై ఆమె సింధూరం పెట్టింది. దండలు మార్చుకున్నారు. గుడిలోనే ఏడు అడుగులు కూడా నడిచారు. తమ భర్తలు ఎప్పుడూ తాగి వచ్చి తమను వేధించేవారన్నారు. ఆ టెన్షన్ తట్టుకోలేక.. ప్రశాంతమైన ప్రేమ జీవితాన్ని గడపాలనుకుంటున్నట్లు ఆ మహిళలు తెలిపారు. ఓ జంటగా గోరఖ్‌పూర్‌లో జీవిస్తామన్నారు. త్వరలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకోనున్నారు. చాలా సాదాసీదాగా పెళ్లి జరిగినట్లు ఆలయ పూజారి ఉమా శంకర్ పాండే తెలిపారు.