అహ్మదాబాద్: తల్లి ప్రియుడ్ని ఆమె ఇద్దరు కుమారులు దారుణంగా హత్య చేశారు. (Sons Kills Mother’s Lover) తల్లితో అతడి సంబంధంపై ఆగ్రహించిన అన్నాదమ్ములు ఆ వ్యక్తిని కత్తితో పొడిచి పేగులు బయటకు లాగి చంపారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ భర్త 15 ఏళ్ల కిందట మరణించాడు. వితంతురాలైన తల్లితో 45 ఏళ్ల రతాన్జీ ఠాకూర్ సంబంధంపై ఆమె ఇద్దరు కుమారులైన 27 ఏళ్ల సంజయ్, 23 ఏళ్ల జయేష్ ఠాకూర్ కలతచెందారు. తమ తల్లికి దూరంగా ఉండాలని పలుమార్లు అతడ్ని హెచ్చరించారు.
కాగా, తల్లితో రతాన్జీ ఠాకూర్ సంబంధం కొనసాగించడంపై ఆ అన్నాదమ్ములు ఆగ్రహంతో రగిలిపోయారు. చనిపోయిన తమ తండ్రికి అగౌరవం, కుటుంబానికి అవమానం కలిగించిన ఆ వ్యక్తి పట్ల వారు కక్షగట్టారు. ఈ నేపథ్యంలో జనవరి 26న గ్రామంలో ఇల్లు నిర్మిస్తున్న రతాన్జీ ఠాకూర్ వద్దకు సంజయ్, జయేష్ వెళ్లారు. వెంట తెచ్చిన కత్తి, రాడ్‌తో అతడిపై దాడి చేశారు. రతాన్జీ ఠాకూర్‌ను కత్తితో పొడిచి పొట్టలోని పేగులను బయటకు లాగి హత్య చేశారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.
మరోవైపు అడ్డుకునేందుకు ప్రయత్నించిన హతుడి అనుచరుడిపై కూడా వారు దాడి చేశారు. కత్తిని చూపించి అక్కడున్న కార్మికులను భయపెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రతాన్జీ హత్యపై కేసు నమోదు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లను ట్రాక్ చేశారు. పరారీలో ఉన్న అన్నాదమ్ములైన సంజయ్, జయేష్ ఆచూకీని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.