ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) దాడి చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు నిందితుడిని హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితుడు షెహజాద్ మహమ్మద్ తరఫున వాదించేందుకు ఇద్దరు లాయర్లు గొడవపడ్డారు. దీంతో న్యాయమూర్తి వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇంతకూ ఏం చేశారంటే..
సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడిచేసిన కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30)ను ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన అతడిని థాణేలో అటవీ ప్రాంతంలో ఉన్న ఒక లేబర్ క్యాంప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ముంబైకి తరలించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరపరిచారు. నిందితుల బోనులో నిలబడి ఉన్న షెహజాద్‌ను.. పోలీసులపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. దానికి అతడు వ్యతిరేకంగా సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో షెహజాద్ వద్దకు వెళ్లిన ఓ లాయరు.. అతని తరఫున తాను వాదిస్తానంటూ వకాలత్ పత్రంపై సంతకం చేస్తున్నాడు.
అంతలోనే మరో న్యాయవాది కూడా నిందితుని వద్దకు వెళ్లి తాను వకాల్తా పుచ్చుకుంటానంటూ సంబంధిత పత్రాలపై సంతకం కోసం ప్రయత్నించాడు. దీంతో ఇద్దరు లాయర్లు కోర్టు హాలులోనే వాదులాడుకున్నారు. దీంతో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి.. ఇద్దరూ ఒక టీమ్‌గా అతని తరఫున వాదనలు వినిపించవచ్చని తెలిపారు. దానికి ఆ ఇద్దరు లాయర్లు కూడా సమ్మతించారు.
కాగా, నిందితుడికి న్యాయస్థానంలో హాజరుపర్చగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి పంపిందని, ఈ దాడి వెనుక అంతర్జాతీయంగా ఏదన్నా కుట్ర ఉందా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి ఐదు నెలల క్రితం భారత్‌కు అక్రమంగా వచ్చిన నిందితుడు తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకున్నాడు. తర్వాత హౌస్ కీపింగ్ సహా చిన్నచిన్న పనులు చేసేవాడు. ఆ ఇల్లు నటుడు సైఫ్ అలీఖాన్‌దని తనకు తెలియదని, కేవలం చోరీ కోసమే అందులో ప్రవేశించినట్టు నిందితుడు తెలియజేసినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.