ఇంఫాల్, ఏప్రిల్ 7: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో బాంబు పేలుడు సంభవించి ఇద్దరు పిల్లలు మరణించగా, వారి తల్లి గాయపడిన దరిమిలా ఐదు జిల్లాల్లో మూడు రోజులపాటు మొబైల్ ఇంటర్నెట్‌ని మణిపూర్ ప్రభుత్వం మంగళవారం నిలిపివేసింది. బాంబు దాడికి నిరసనగా ఆందోళనకారులు సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేయగా భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాంబు పేలుడు సంభవించిన బిష్ణుపూర్‌లో కర్ఫ్యూ కూడా విధిస్తుపన్నట్లు హోమ్‌శాఖ ఉత్తర్వు పేర్కొన్నది. తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రజాశాంతికి భంగం కలిగించే కార్యకలాపాలను నివారించేందుకు ఇంటర్నెట్ను నిషేధించామని అధికారులు తెలిపారు. ఈ చర్య అవసరమని, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని, సహకరిం చాలని అధికారులు కోరారు.
మొయిరంగ్‌లో ఏం జరిగింది?
మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలకు కేంద్రమైన మొయిరంగ్‌లోని ట్రాంగ్లోబీ వాంగ్ లీకీ గ్రామంలోని ఒక ఇంటిపై తీవ్రవాదులు బాంబులు వేయగా ఒక ఐదేండ్ల్ల బాలుడు, ఒక ఆరు నెలల బాలిక నిద్రలోనే మరణించగా ఆ పిల్లల తల్లి గాయపడింది. ఈ ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పెట్రోల్ పంపు వద్ద రెండు చమురు ట్యాంకర్లు, ఒక ట్రక్కుకు నిప్పుపెట్టిన స్థానికులు పోలీసు స్టేషన్ వెలుపల టైర్లను కాల్చడంతోపాటు తాత్కాలిక పోలీసు ఔట్‌పోస్టును ధ్వంసం చేశారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించారు.