Tamil Nadu : తమిళనాడులో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి. కానీ, ఏ పార్టీకి అధికారం చేపట్టేందుకు కావాల్సిన స్పష్టమైన మెజారిటీ రాలేదు. టీవీకేకు 108 సీట్లు వచ్చాయి. 234 సీట్లున్న తమిళనాడులో అధికారం చేపట్టాలంటే 118 సీట్లు అవసరం. అంటే, టీవీకేకు ఇంకో 10 సీట్లు కావాలి. దీంతో ఆ పార్టీ అధికారం చేపట్టాలంటే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పదు. అందులోనూ ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు. బీజేపీతో వెళ్తే కొన్ని ఇబ్బందులుంటాయి. ఈ నేపథ్యంలో విజయ్ ముందు మూడు అవకాశాలున్నాయి. అవి ఇవే.
డీఎంకే కూటమి పార్టీలు
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసింది. ఈ నేపథ్యంలో డీఎంకే మినహా మిగతా కూటమి పార్టీలతో టీవీకే పొత్తు పెట్టుకోవచ్చు. డీఎంకే కూటమిలో గెలిచిన పార్టీల సంఖ్య ఇది. కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీలు 4, ఐయూఎంఎల్ 2, వీసీకే 2 సీట్లు సాధించాయి. ఈ పార్టీలు కలిసి 13 సీట్లున్నాయి. వీటితో కలిసి టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.
డీఎంకే, ఏఐఏడీఎంకే కూటమి పార్టీలు
ఇది కొంచెం క్లిష్టమైన మార్గమే. ఎందుకంటే అటు డీఎంకే కూటమిలోని, ఇటు ఏఐఏడీఎంకే కూటమిలోని చిన్న పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకోవచ్చు. అవి కాంగ్రెస్ 5 సీట్లు, పీఎంకే, 4 సీట్లు, ఐయూఎంఎల్ 2 సీట్లు, వీసీకే 2 సీట్లు కలిగి ఉన్నాయి. ఇందులో ఏఐఏడీఎంకే కూటమితో కలిసి పోటీ చేసిన పీఎంకేను కూడా కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.
ఏఐఏడీఎంకే నుంచి బయటినుంచి మద్దతు
ఇది కూడా కొంచెం క్లిష్టమైన మార్గమే. కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలు అక్కర్లేదనకుంటే ఏకంగా ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోవచ్చు. అది కూడా బయటినుంచి ఆ పార్టీ మద్దతు తీసుకోవచ్చు. అంటే, టీవీకేకు మద్దతు ఇచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏఐఏడీఎంకే సహకరిస్తుంది. కానీ, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండకపోవచ్చు. అంటే, మంత్రి పదవులు తీసుకోవడం జరగదు. ఏఐఏడీఎంకే పార్టీకి 47 సీట్లు వచ్చాయి. ఈ పార్టీ, టీవీకే కలిస్తే మరో పార్టీ మద్దతు అవసరం లేదు. పైగా జాతీయ రాజకీయాల్లో తటస్థంగా ఉన్నట్లవుతుంది. ఇక, ఏఐఏడీఎంకే పార్టీ బీజేపీకి దూరమవుతుంది. అయితే, టీవీకే, ఏఐఏడీఎంకే పార్టీల మధ్య సిద్ధాంతపరంగా విబేధాలున్నాయి. దీంతో ఈ కలయిక సాధ్యపడుతుందా అనేది అనుమానమే.