TVK chief Vijay : కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే తమిళనాడు (Tamil Nadu), పుదుచ్చేరి (Puducherry) వేర్వేరు అని, తాము మాత్రం అందరం కలిసే ఉన్నామని నటుడు, టీవీకే చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) అన్నారు. పుదుచ్చేరిలోని ఉప్పాలం (Uppalam) లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కరూర్ తొక్కిసలాట (Karur stampede) అనంతరం జరిగిన ఈ తొలి బహిరంగసభలో ఆయన.. తమిళనాడులోని డీఎంకే సర్కారు (DMK govt) పై తీవ్ర విమర్శలు చేశారు.
పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన బాధ్యత అని విజయ్ పేర్కొన్నారు. సీఎం రంగసామి నేతృత్వంలోని అక్కడి ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వం వంటిది కాదని, ప్రతిపక్ష పార్టీలతోనూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని మెచ్చుకున్నారు. మాకు ప్రత్యర్థి అయినా మా పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీకి అడగగానే భద్రత రంగస్వామి ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర పాలనకు సంబంధించిన విషయాలను పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలని సూచించారు.
కానీ ఆయన (స్టాలిన్) ఎప్పటికీ నేర్చుకోరని విజయ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మాజీ సీఎం, దివంగత ఎంజీ రామచంద్రన్‌కు పుదుచ్చేరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ.. పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని పునరుద్ఘాటించారు. తమకు రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నో సంవత్సరాల నుంచి 16 తీర్మానాలను ప్రవేశపెట్టినా కేంద్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు.