మాడ్రిడ్, నవంబర్ 18: తాబేళ్లు అంటే చిన్న సైజులో పైన డొప్పతో కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉభయచర జీవులు. ఎక్కువగా సముద్రాల లోపల జీవిస్తాయి. అయితే, ఇదివరకు భూమిపై కారుసైజులో ఉండే తాబేళ్లు నివసించినట్టు స్పెయిన్ పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. 2016లో సముద్రంలో దొరికిన ఓ తాబేలు శిలాజం ఆధారంగా దీన్ని కనుగొన్నారు.
ఇవి డైనోసార్ల కాలంలో జీవించి ఉన్నట్టు నిర్ధారించారు. ‘లెవియాథనోచెలిస్ ఎనిగ్మాటికా’గా పిలిచే ఈ తాబేళ్లు 3.7 మీటర్ల పొడవు ఉంటాయని, అంటే మినీ కూపర్ కారు సైజులో వీటి పరిమాణం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ తాబేలు భారీ పరిమాణాన్ని చూసి మొదట శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఇవి సముద్రం అడుగుభాగాన మొసళ్లతో కలిసి జీవించేవని, వాటినుంచి రక్షించుకునేందుకు వీటిపైన ఉండే డొప్పకు రెండువైపులా కొమ్ముల్లాంటి నిర్మాణాలు ఉండొచ్చని చెబుతున్నారు.