రోమ్: పోప్ ఫ్రాన్సిస్ శవపేటికను సెయింట్ పీటర్స్ బాలిసికా నుంచి సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఫ్రాన్సిస్ పార్దీవదేహానికి ప్రపంచ దేశాధినేతలతో పాటు లక్షలాది మంది అభిమానులు, క్రైస్తవులు తుది నివాళి(Pope Francis Funeral) కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సాధారణ రీతిలో ఫ్రాన్సిస్ ఖననం జరగనున్నది. మామూలు చెక్కతో తయారైన శవపేటికలో ఫ్రాన్సిస్‌ను ఖననం చేయనున్నారు. ఫ్రాన్సిస్ చివరిచూపు కోసం ప్రపంచ దేశాధినేతలతో పాటు లక్షల సంఖ్యలో జనం హాజరయ్యారు. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ సోమవారం వాటికన్ సిటీలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు సుమారు రెండు లక్షల మంది నివాళి అర్పించారు. అంత్యక్రియలు నిర్వహించడానికి పూర్వం.. సెయింట్ పీటర్స్ బాసిలికాలో ట్రంప్‌తో జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఆ మీటింగ్ చాలా ఫలవంతమైందని వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. సామూహిక నివాళి కార్యక్రమంలో ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. ఫిన్‌ల్యాండ్, ఈస్టోనియా దేశాధ్యక్షులు ఆయన పక్కన నిలుచున్నారు. ఆ ఇద్దరు నేతలు కూడా ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నారు.