హోషియార్పూర్: పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని ఖురాల్గఢ్ సాహిబ్ (Khuralgarh Sahib) దగ్గర జరిగే బైశాఖి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న 17 మంది యాత్రికులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఘర్శంకర్లోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చండీగఢ్‌లోని PGIMERలో చేర్చారు. ప్రతి బైశాఖి ఉత్సవాల సందర్భంగా గురు రవిదాస్‌కు సంబంధించిన ఖురాల్గఢ్ సాహిబ్‌కు యాత్రికులు భారీగా తరలివస్తుంటారు.
ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లా మస్తాన్ ఖేరాకు చెందిన 17 మంది ఖురాల్గఢ్ సాహిబ్‌కు చేరుకున్నారు. అక్కడ నడుచుకుంటూ ఉత్సవాలు జరిగే ప్రదేశానికి వెళ్తుండగా అదుపుతప్పిన ట్రక్కు మీద నుంచి దూసుకెళ్లింది. ట్రక్కు డ్రైవర్ డౌన్లో వాహనాన్ని కంట్రోల్ చేయలేక యాత్రికులపైకి దూసుకెళ్లాడని పోలీసులు తెలిపారు.