వారణాసి : ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో నిర్వహించిన విజువల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ వివాదానికి దారి తీసింది. విజువల్ ఆర్ట్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అమ్రేష్ కుమార్.. సీతారాముల ఫోటోలో తన దృశ్యాన్ని ఉంచారు.
రాముడి ముఖానికి బదులుగా తన ముఖాన్ని, సీత ముఖానికి బదులుగా ఆయన భార్య ఫేస్‌ను ప్రదర్శించారు. అయితే ఎగ్జిబిషన్లో భాగంగా ఈ ఫోటోను తిలకించిన యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ అమ్రేష్ కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరి మనోభావాలను రెచ్చగొట్టేలా అమ్రేష్ కుమార్ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు.
అయితే ఈ వివాదంపై అమ్రేష్ కుమార్ స్పందించారు. రాముడు అందరికి చెందినవాడు అని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇంత వరకు స్పందించలేదు. అమ్రేష్పై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోకపోతే తాము నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.