జైపూర్: నాలుగు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను విడదీసి ‘భిల్ ప్రదేశ్’ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. (Bhil Pradesh Demand) గిరిజనుల అతిపెద్ద సంఘం ఆదివాసీ పరివార్‌తో సహా 35 గిరిజన సంఘాలు గురువారం మెగా ర్యాలీ నిర్వహించాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చాయి. రాజస్థాన్ బాన్స్వారాలోని మంగర్ ధామ్‌లో గురువారం జరిగిన భారీ సభకు రాజస్థాన్‌తో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర నుంచి గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. ఈ నాలుగు రాష్ట్రాల్లోని 49 జిల్లాలను కలిపి కొత్త రాష్ట్రం ‘భిల్ ప్రదేశ్’ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన రాజస్థాన్‌లోని 12 జిల్లాలు, మధ్యప్రదేశ్‌లోని 13 జిల్లాలను కూడా ఈ రాష్ట్రంలో కలపాలని కోరారు.
కాగా, ఆదివాసీ పరివార్ సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు మేనకా దామోర్ ఈ సందర్భంగా మాట్లాడారు. పూజారుల సూచనలను గిరిజన మహిళలు పాటించవద్దని పిలుపునిచ్చారు. ‘గిరిజన కుటుంబాలకు సింధూరం వర్తించదు. మంగళ సూత్రాన్ని ధరించరు. గిరిజన సమాజంలోని మహిళలు, బాలికలు చదువుపై దృష్టి సారించాలి. ఇక నుంచి అందరూ ఉపవాస దీక్షలు విరమించాలి. మనం హిందువులం కాదు’ అని ఆమె అన్నారు.
మరోవైపు ‘భిల్ ప్రదేశ్’ రాష్ట్రం డిమాండ్ కొత్తది కాదని బాన్స్వారాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎంపీ రాజ్‌కుమార్ రోట్ తెలిపారు. తమ పార్టీ ఈ డిమాండ్‌ను బలంగా లేవనెత్తుతోందని చెప్పారు. మెగా ర్యాలీ తర్వాత తమ ప్రతినిధి బృందం రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలుస్తుందని అన్నారు.
కాగా, కుల ప్రాతిపదికన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రాజస్థాన్ గిరిజన శాఖ మంత్రి బాబులాల్ ఖరాడీ తెలిపారు. ఇదే జరిగితే ఇతర కులాలు, వ్యక్తులు కూడా ప్రత్యేక రాష్ట్రాలను డిమాండ్ చేస్తారని చెప్పారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని అన్నారు. అలాగే కేంద్రానికి కూడా ఈ ప్రతిపాదన పంపబోమని వెల్లడించారు.
మరోవైపు నాలుగు రాష్ట్రాలకు చెందిన గిరిజనుల భారీ సభ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీగా పోలీస్ బలగాలను మోహరించింది. అలాగే మెగా ర్యాలీ ప్రాంతంలో ఇంటర్నెట్ను నిలిపివేశారు.