ఇండోర్, జూన్ 22: పొట్టకూటి కోసం ఉపాధి వెతుక్కుంటున్న ఓ గిరిజన మహిళ(20)ను మోసగించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ జిల్లా తాజ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిందోరి గ్రామానికి చెందిన మహిళ, ఆమె భర్త ఉపాధి కోసం ఉజ్జయిన్ చేరుకున్నారు.
స్థానిక ఇందిరానగర్ ప్రాంతంలో బుధవారం పని కోసం ఆరా తీస్తుండగా రవి అనే వ్యక్తి పని ఇప్పిస్తానని తాజ్పూర్ గ్రామ సమీపంలోని ఒక షెడ్డు వద్దకు తీసుకెళ్లాడు. మహిళను ఆ షెడ్డులో ఉంచి సరుకులు ఇప్పిస్తానని ఆమె భర్తను ఉజ్జయిన్‌కు తీసుకెళ్లాడు. వారు వెళ్లగానే ఇమ్రాన్ అనే వ్యక్తి షెడ్డు వద్దకు వచ్చి మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
మహిళ భర్తను ఉజ్జయిన్లో వదిలి వచ్చిన రవి కూడా మహిళపై అత్యాచారం చేశాడు. వీరి నుంచి ఎలాగోలా తప్పించుకున్న మహిళ అక్కడికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ క్వారీ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడి కార్మికులకు తనపై జరిగిన లైంగిక దాడి గురించి తెలిపింది. కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. శనివారం నిందితుల్లో ఒకడైన ఇమ్రాన్ ఇంటిని, ఘటన జరిగిన షెడ్డును పోలీసులు జేసీబీతో కూల్చి వేయించారు.