న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కారు 2016లో ఆర్భాటంగా ప్రారంభించిన స్టార్టప్ ఇండియా పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నది. భారీ సంఖ్యలో స్టార్టప్‌లు మూతపడుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు 11,223 స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరుకు చెందిన ఓ లాజిస్టిక్స్ స్టార్టప్ తన ఉద్యోగులకు ఓ రెండు లైన్ల ఈమెయిల్ పంపించింది. అందులో సబ్జెక్ట్ దగ్గర వైండింగ్ డౌన్(మూసేస్తున్నాము) అని ఆ కంపెనీ రాసింది. నాలుగేళ్లలో కేవలం నాలుగైదు ప్రాజెక్టులను మాత్రమే సంపాదించుకున్న ఆ కంపెనీ ఇక మూసేయడమే మంచిదని నిర్ణయించుకుంది. అలా మూసివేతకు గురైన కంపెనీలు వేల సంఖ్యలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు మనుగడ సాగించి మూతపడగా మరికొన్ని ప్రారంభించిన కొన్ని నెలలకే కాలగర్భంలో కలసిపోయాయి.
2025లో అక్టోబర్ వరకు 11,223 స్టార్టప్‌లు దేశంలో మూతపడినట్లు ట్రాక్సన్ గణంకాలు చెబుతున్నాయి. 2024లో 8,649 స్టార్టప్‌లు మూతపడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం అధికంగా స్టార్టప్‌లు మూతపడ్డాయి. ఈ ఏడాది మూతపడిన ప్రముఖ స్టార్టప్‌లలో ఫై, హైక్, బీప్కార్ట్, ఆస్ట్రీ, ఓమ్ మొబిలిటీ, కోడ్ పారట్, బ్రలిప్, సబ్టల్ లే, ఓటీపీ, లాగ్ 9 మెటీరియల్, ఏఎన్ఎస్ కామర్స్ వంటివి ఉన్నాయి. తాము అనుకున్న లక్ష్యాలకు చేరువ కాలేకపోవడం, రెగ్యులేటరీ సమస్యలు, ఎక్కువ కాలం నిరీక్షించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు లేకపోవడం మొదలైనవి స్టార్టప్‌ల మూసివేత వెనుక ఉన్న కొన్ని ప్రధాన కారణాలని తెలుస్తోంది.
బీ2సీ((బిజినెస్ టు కన్జ్యూమర్) ఈ కామర్స్‌లోనే అత్యధిక మూసివేతలు చోటుచేసుకున్నట్లు ట్రాక్సన్ సహ వ్యవస్థాపకురాలు నేహా సింగ్ తెలిపారు. బీసీసీ ఈకామర్స్‌లో 5,776 స్టార్టప్‌లు మూతపడగా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌లో 4174, సాస్(సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్)లో 2,785 మూసివేతలు జరిగాయని ఆమె తెలిపారు. తమ ప్రొడక్ట్‌ని మార్కెట్‌కి తగ్గట్టుగా తయారుచేయడంలో, స్థిరమైన వ్యాపార విధానాలను రూపొందించడంలో స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ మూసివేతలు రుజువు చేస్తున్నాయని ఆమె చెప్పారు. వినియోగదారుడికి సంబంధించిన వ్యాపారాలలో కస్టమర్‌కు కల్పించే ప్రయోజనాలు ఎక్కువగా ఉండడం, అందుకు తగ్గట్టుగా ఆదాయం కనిపించకపోవడం, వ్యాపారాన్ని కొనసాగించేందుకు నిధుల లేమి వంటి ప్రధాన కారణాలుగా ఆమె తెలిపారు.
ఒకనాడు స్టార్టప్‌లు పెద్దసంఖ్యలో స్థాపించేందుకు కేంద్ర స్థానంగా ఉన్న బీ2సీ ఈ-కామర్స్ రంగంలోనే ఇప్పుడు సగానికి పైగా మూసివేతలు జరగడం గమనార్హం. వినియోగదారుడికి భారీ డిస్కౌంట్లు ఇవ్వడంపైనే మనుగడ సాధించాలనుకున్న కంపెనీలు తీవ్రంగా నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. ఆదాయం లభించే మాడ్యూల్స్‌గా పరిగణించిన ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, సాస్ కూడా షట్‌డౌన్ బారిన పడక తప్పలేదు. 4,174 ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, 2785 సాస్ స్టార్టప్‌లు ఈ ఏడాది మూతపడినట్లు ట్రాక్సన్ వెల్లడించింది. ఇవిగాక ఫ్యాషన్ టెక్‌లో 840, హెచ్ఆర్ టెక్‌లో 846, ఎడ్యుకేషన్ ఐటీలో 549 స్టార్టప్ కంపెనీలు ఈ ఏడాది మూతపడ్డాయి.
సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం కోసం ఏర్పడిన ఈ కంపెనీలు కస్టమర్ అవసరాలను, వారి కొనుగోలు శక్తిని అంచనా వేయడంలో విఫలమయ్యాయి. ఇక హెల్త్‌కేర్ బుకింగ్ ప్లాట్‌ఫారాలలో 762 స్టార్టప్‌లు కనుమరుగయ్యాయి. ఇన్వెస్ట్మెంట్ టెక్‌లో 579, ఇంటర్నెట్ ఫస్ట్ బ్రాండ్స్‌లో 817 స్టార్టప్‌లు ఈ ఏడాది మూతపడ్డాయి. వందల స్టార్టప్‌లు మూతపడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోదీ సర్కారు పథకాలు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోతున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.