రాంచీ, జూలై 30: జార్ఖండ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకొన్నది. హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 18 బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, 20 మందికి పైగా గాయాలయ్యాయి. జంషెడ్‌పూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని బారాబంబూ సమీపంలో మంగళవారం వేకువజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. ప్రమాదం జరిగిన తీరుపై అస్పష్టత నెలకొన్నది. అప్పటికే ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని, దాని వ్యాగన్లు పక్కన ఉన్న ట్రాక్‌పై పడటంతో.. ఎదురుగా వస్తున్న హౌరా-ముంబై ఇంజిన్ వాటిని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఓ రైల్వే అధికారి మాట్లాడుతూ మెయిల్ రైలు ప్రమాదం జరిగిన ఘటనాస్థలికి సమీపంలోనే మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పిందని, అయితే రెండు ప్రమాదాలు ఒకసారి జరిగాయా? అనేదానిపై స్పష్టత లేదని పేర్కొన్నారు.
వరుసగా రైలు ప్రమాదాలు చోటుకుంటుండటంపై విపక్షాలు మండిపడ్డాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రీల్స్ చేయడం మాని, తన పనిపై దృష్టి పెట్టాలని హితవు పలికాయి.