టెలికం కంపెనీలకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి టెలికం సంస్థ తాము అందించే ప్లాన్లలో 30 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్లను చేర్చాలని ట్రాయ్ స్పష్టం చేసింది.
‘‘టెలికం సంస్థలు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు 30 రోజుల వ్యాలిడిటీతో ఒక ప్లాన్ వోచర్, ఒక స్పెషల్ టారిఫ్ వోచర్, ఒక కాంబో వోచర్‌ను అందించాలి’’ అని నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం టెలికం కంపెనీలన్నీ కేవలం 28 రోజుల వ్యవధితోనే ప్లాన్లు అందిస్తున్నాయి.
దీనివల్ల ప్రతి వినియోగదారుడు ఏడాదిలో 13 సార్లు రీచార్జ్ చేసుకోవలసి వస్తోంది. నెల ప్లాన్లు వేసుకుంటున్నప్పటికీ ఏడాదికి 13 సార్లు రీచార్చ్ చేసుకోవలసి రావడంపై కొందరు ట్రాయ్‌కు ఫిర్యాదులు చేశారు.
ఈ నేపథ్యంలో షేర్‌హోల్డర్ల మీటింగ్ నిర్వహించిన ట్రాయ్.. ఈ విషయంలో తలదూర్చాలా వద్దా? అని చర్చించింది. అనంతరం టెలికం కంపెనీలన్నీ 30 రోజుల ప్లాన్లు అందించాలంటూ మార్గదర్శకాలు విడుదల చేసింది.