Ganesh Uike : ఒడిశా – చత్తీస్గఢ్ (Odisha – Chattishgarh) సరిహద్దుల్లో గురువారం ఉదయం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో మరణించిన ఐదుగురు నక్సలైట్లలో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు గణేశ్ ఉయికే మరణించారు. ఈ విషయాన్ని ఒడిశా పోలీసులు స్పష్టంచేశారు. గణేశ్ ఉయికే (Ganesh Uike) గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. మావోయిస్టుల బలం పెంచడం కోసం ఎంతో కృషిచేశారు. ఆయన తలపై రూ.1.1 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోగల కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా.. వారిలో కీలక నేత గణేశ్ ఉయికే కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు కోటగడ్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గాలింపు చర్యలు చేపట్టిందని పోలీసులు తెలిపారు. మొత్తం 23 టీమ్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయని, అందులో 20 స్పెషల్ ఆపరేషన్ టీమ్స్, రెండు సీఆర్పీఎఫ్ టీమ్స్, ఒక బీఎస్ఎఫ్ టీమ్ ఉన్నాయని చెప్పారు.
ఈ కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా ఎదురుపడిన మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయని భద్రతా బలగాలు వెల్లడించాయి. కాల్పుల్లో మొత్తం ఐదుగురు మావోయిస్టులు మృతిచెందగా.. వారిలో గణేశ్ ఉయికే తోపాటు రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు బారి అలియాస్ రాకేష్, మరో మావోయిస్ట్ అమృత్గా గుర్తించారు. మిగతా ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గణేశ్ ఉయికే తలపై రూ.1.1 కోట్ల రివార్డు ఉండగా.. బారి తలపై రూ.22 లక్షలు, అమృత్ తలపై రూ.1.65 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు. గణేశ్ ఉయికే నల్లగొండ జిల్లా పుల్లెంలకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.