న్యూఢిల్లీ, ఏప్రిల్7: భారతీయులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఉపయోగించే దాదాపు అన్ని వస్తువులు కల్తీ అవుతున్నాయి. పాల నుంచి పన్నీర్ దాకా, టూత్ పేస్ట్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా అన్నీ కల్తీ అవుతున్నట్టు గత నెలలో ఆహార భద్రత అధికారులు జరిపిన దాడుల్లో వెల్లడైంది. కల్తీ వస్తువులు అమ్మే నేరగాళ్లు ఒక సిండికేట్‌గా ఏర్పడి పరిశ్రమ స్థాయిలో ఈ నకిలీలను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదివరకు ఖరీదు ఎక్కువగా ఉండే విలాస వస్తువులను మాత్రమే కల్తీ చేసే దుండగులు ఇప్పుడు సామాన్యులు రోజువారీ ఉపయోగించే దాదాపు అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు. దీంతో ప్రజలు తమ డబ్బును కోల్పోవడమే కాకుండా రసాయనాలతో తయారైన ఉత్పత్తులను వాడటం ద్వారా తమ ఆరోగ్యానికి ముప్పును కొని తెచ్చుకుంటున్నారు.
ఢిల్లీలో టూత్‌పేస్ట్ రాకెట్
ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది.. భారతీయుల గృహాల్లో సాధారణంగా వినియోగించే వస్తువులను కల్తీ చేస్తున్న ఓ అధునాతన పరిశ్రమను గత గురువారం కూల్చివేశారు. కాంజీవాలాలోని ఓ కేంద్రంలో టూత్‌పేస్ట్, కూల్ డ్రింక్స్‌ను కల్తీ చేస్తున్నట్టు కనుగొని దానిపై దాడులు జరిపారు. ఇక్కడి ఓ ఫ్యాక్టరీలో తయారవుతున్న లోపభూయిష్టమైన టూత్‌పేస్ట్‌కు సెన్సోడైన్ లేబుల్ వేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్న ఆ టూత్‌పేస్ట్ వినియోగానికి పనికిరాదని తేల్చారు. ఫ్యాక్టరీ యజమానిని అరెస్టు చేశామని క్రైంబ్రాంచ్ డీసీపీ పంకజ్‌కుమార్ తెలిపారు. గత నెల 31న ఢిల్లీ పోలీసులు మరో చోట దాడులు చేసి గడువు తీరిన ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌కు కొత్త తేదీలు వేస్తున్నట్టు కనుగొన్నారు. ఓ రసాయనం సాయంతో ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్‌ల డబ్బాలపై ఉన్న ఎక్స్పైరీ డేట్‌ను తుడిచివేసి, కొత్తగా ఏడాది తేదీలు వేస్తున్నారని డీసీపీ హర్స్ ఇందోరా తెలిపారు. ఇక్కడి నుంచి 600 థమ్స్అప్ క్యాన్లు, 840 స్ర్పైట్, 480 లిమ్కా, 1,176 కోకాకోలా క్యాన్లతోపాటు పలు బ్రాండ్ల బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
సూరత్‌లో కల్తీ పన్నీర్
గుజరాత్ రాష్ట్రం, సూరత్ నగరంలోని పండేసరా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీపై సూరత్ ఆహార భద్రత విభాగం, సూరత్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దాడులు జరిపి 1,401 కిలోల కల్తీ పన్నీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రానికి ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ ఉండటం గమనార్హం. ఇక్కడ తయారవుతున్న పన్నీర్‌ను ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు అత్యంత లోపభూయిష్టంగా ఉన్నట్టు వెల్లడైందని డీసీపీ రాజ్‌దీప్‌సింగ్ నకుం తెలిపారు. ఈ కేంద్రంలో ఇంకా రూ.28 లక్షల విలువైన నకిలీ ఎసిటిక్ యాసిడ్, పామ్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరోవైపు గత ఫిబ్రవరిలో సబర్కాంత జిల్లాలో యూరియా, డిటర్జెంట్ వాడి కల్తీపాలు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
సోషల్ మీడియాపై కేసులు
ఓ వైపు కల్తీ వస్తువులు విశృంఖలంగా మార్కెట్లలో విక్రయమవుతుండగా, ఈ విషయాలను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు నమోదుచేసింది. మార్కెట్లో కల్తీ పన్నీర్, కల్తీ పాలు విస్తారంగా లభిస్తున్నాయని, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏం చేస్తున్నదని ప్రశ్నించిన నెటిజన్లపై కేసులు నమోదయ్యాయి. చట్ట విరుద్ధంగా తమ సంస్థకు చెందిన వెబ్సైట్ల నుంచి పత్రాలను తస్కరించి, తాము సేకరించిన సమాచారాన్నే నెటిజన్లు వివిధ సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నారని సంస్థ ఆరోపించింది.
హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్
గత నెల చివర్లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎస్కేఆర్ ఫుడ్ ప్రాడక్ట్స్ యజమాని హసన్అలీ రూపాణీని అరెస్టు చేశారు. ఎస్కేఆర్ ఫుడ్స్‌లో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నాణ్యత లేని ముడి సరుకుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్నట్టు కనుగొన్నారు. అల్లం వెల్లుల్లి పొట్టును కూడా పేస్ట్‌లో కలుపుతున్నట్టు తెలుసుకున్నారు. ఇక ఈ పేస్ట్‌లో హానికరమైన ఎసిటిక్ యాసిడ్, గ్జాంతన్ గమ్ పౌడర్‌ను కలుపుతున్నట్టు కనుగొన్నారు. తయారైన పేస్ట్‌ను ప్లాస్టిక్ డబ్బాలలో మూతలు లేకుండా పెట్టడంతో వాటిపై ఈగలు, దోమలు, ఇతర క్రిమికీటకాలు వాలుతున్నాయని, ఇవి ఆరోగ్యానికి హానికరమని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ 4,032 కిలోల అల్లం వెల్లులి పేస్ట్‌ను, 6,210 కిలోల అల్లం, ఎల్లిగడ్డను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పరిసరాలలోని మల్లాపూర్‌లో ఆహార భద్రతా విభాగం గత నెల 29న జీడీపప్పును రీప్యాకేజింగ్ చేస్తున్న కంపెనీపై దాడులు జరిపింది. సుమారు 36 కిలోల జీడిపప్పుకు పురుగులు పట్టాయని, నాణ్యత లేని మరో 210 కిలోల (రూ.1.5 లక్షల విలువైన) జీడిపప్పును స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.