Tongue-Splitting : ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే, అనుభవం లేకుండానే టంగ్ స్ప్లిట్టింగ్ (Tounge splitting – నాలుక కత్తిరించడం) ఆపరేషన్ చేసి, అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక వారు లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న టాటూ పార్లర్ (Tattoo Parlour) ను సీజ్ చేశారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని చింతామణి ప్రాంతానికి చెందిన ఎస్ హరిహరన్ (24), కూత్తాయిప్పర్ ప్రాంతానికి చెందిన వీ జయరామన్ (24) నెల రోజుల క్రితం తిరుచ్చిలో ఓ టాటూ పార్లర్‌ను ఏర్పాటు చేశారు. అయితే పార్లర్ నిర్వహణకు సంబంధించి వారు ఎలాంటి శిక్షణ పొందలేదు. పార్లర్ ఏర్పాటుకు లైసెన్స్ కూడా తీసుకోలేదు. కానీ ఆ పార్లర్లో వాళ్లు శరీరాన్ని సూదులతో గుచ్చి టాటూలు వేయడం, కనుగుడ్లపై టాటూలు వేయడం, నాలుకలు కత్తిరించడం లాంటి ఆపరేషన్లు చేస్తున్నారు.
ఇటీవల ఓ యువకుడికి టంగ్ స్ప్లిట్టింగ్ ఆపరేషన్ చేయడమేగాక, అందుకు సంబంధించిన వీడియోను వాళ్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో వైరల్ అయ్యింది. దాంతో ఎంక్వయిరీ చేసిన పోలీసులకు వారు ఎలాంటి శిక్షణ లేకుండానే ప్రాణాంతకమైన టంగ్ స్ప్లిట్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, లైసెన్స్ తీసుకోకుండా పార్లర్ నడుపుతున్నారని తేలింది.
దాంతో పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. పార్లర్లోని టంగ్ స్ప్లిట్టింగ్, టాటూయింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పార్లర్‌ను సీజ్ చేశారు. హరిహరన్ ఒకసారి ముంబైకి వెళ్లి రూ.2 లక్షలు ఖర్చుపెట్టి కనుగుడ్డుపై టాటూ వేయించుకున్నాడని, ఆ తర్వాత తిరుచ్చికి తిరిగొచ్చి జయరామన్‌తో కలిసి తనే స్వయంగా టాటూ పార్లర్‌ను నెలకొల్పాడని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Can anyone perform the surgery? Does the medical council allow this?@JPNadda @Subramanian_ma @IMAIndiaOrg @chennaipolice_ pic.twitter.com/1StypvDiEp
— James Stanly (@JamesStanly) December 16, 2024