కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ సైబర్ మోసానికి గురై, సుమారు రూ.56 లక్షలు నష్టపోయారు. కోల్‌కతాలోని భారతీయ స్టేట్ బ్యాంక్, హైకోర్టు శాఖలో ఉన్న ఈ ఖాతా కొన్నేండ్లుగా క్రియాశీలంగా లేదు. సైబర్ నేరగాళ్లు ఆయన కేవైసీ వివరాలను అప్డేట్ చేయడం కోసం ఫోర్జరీ చేసిన ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించారు.
అసలు పత్రాలుగానే కనిపించేందుకు వేరొక ఫొటోను ముద్రించారు. ఈ ఖాతాకు అనుసంధానం చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను కూడా మార్చేశారు. గత నెల 28న ఇదంతా జరిగింది. ఆ తర్వాత మోసగాళ్లు అనేక అనధికారిక ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలను జరిపారు. రూ.56,39,767 కాజేశారు.