ముంబై : ఇండియాలో రెండు యాపిల్ స్టోర్స్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఆ రిటైల్ స్టోర్స్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఆ స్టోర్స్‌ను టిమ్ కుక్(Tim Cook) ఓపెన్ చేయనున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. రెండు నగరాల్లో జరిగే ఓపెనింగ్ కార్యక్రమాల్లో టిమ్ కుక్ పాల్గొంటారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 18న ముంబైలో, 20వ తేదీన ఢిల్లీలో యాపిల్ స్టోర్స్‌ను టిమ్ కుక్ ఓపెనింగ్ చేయనున్నారు.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ (Jio World Drive Mall)లో ఉదయం 11 గంటలకు టెక్ దిగ్గజం తొలి అధికారిక రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానుంది.ముంబై తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో రెండో యాపిల్ రిటైల్ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ సాకెట్లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్ రిటైల్ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.