న్యూఢిల్లీ, మే 20: జ్యుడీషియల్ సర్వీస్‌లో చేరాలనుకునే అభ్యర్థులు కనీసం మూడేండ్లపాటు లా ప్రాక్టీస్ చేసి ఉండాలన్న గతంలోని నిబంధనను సుప్రీంకోర్టు తిరిగి ప్రవేశపెట్టింది. న్యాయమూర్తులకు ప్రాక్టికల్ అనుభవం లేకపోవటం వివిధ సమస్యలకు దారితీస్తున్న సంగతిని గమనించి, 2002లో ఎత్తివేసిన నిబంధనను తిరిగి తీసుకొస్తున్నట్టు సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.
మున్సిఫ్ మెజ్రిస్టేట్గా జ్యుడీషియల్ సర్వీస్‌లో చేరాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా న్యాయవాదిగా మూ డేండ్ల అనుభవాన్ని కలిగి ఉండాలని ధర్మాసనం పేర్కొన్నది. ‘సివిల్ జడ్జీల పరీక్షను రాసే అభ్యర్థులకు మూడేండ్ల లా ప్రాక్టీస్ రూల్ తప్పనిసరి. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు సివిల్ జడ్జీల పరీక్ష నిబంధనల్ని మార్చాలి’ అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.