గడ్చిరోలి/కొత్తగూడెం క్రైం, మే 13: మహారాష్ట్ర దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దున ఉండే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్పీ నీలోత్పల్ కథనం ప్రకారం భామ్రాగఢ్‌లోని కాట్రాంగట్ట గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పెరిమిలి దళానికి చెందిన మావోయిస్టులు శిబిరం ఏర్పాటు చేసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రెండు సీ-60 జవాన్ల బృందాలు, పోలీసులు గాలిస్తుండగా మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి.
ఇరువర్గాల మధ్య సుమారు 30 నిమిషాల పాటు భీకరపోరు జరిగింది. ఘటనా స్థలం నుంచి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు వారికి సంబంధించిన మారణాయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతులను పెరిమిలి దళం ఇన్చార్జి, డివిజనల్ కమిటీ కమాండర్ వాసు, మహిళా మావోయిస్టులు రేష్మా మద్కం(25), కమ్ల మాదవి(24)గా పోలీసులు గుర్తించారు. వాసుపై రూ.16 లక్షలు, రేష్మాపై రూ.4 లక్షలు, మాదవిపై రూ.2 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే-47 రైఫిల్, ఒక కార్బైన్, ఒక ఇన్సాప్ రైఫిల్, నకల్స్ సాహిత్యం, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.