న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee)పై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అతనితో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు బుక్ చేశారు. కామాక్ స్ట్రీట్‌లో ఉన్న ఆఫీసులో జరిగిన ఘర్షణ నేపథ్యంలో మరో 13 మందిని అరెస్టు చేశారు. అభిషేక్ బెనర్జీ ఆఫీసులో పనిచేసే ప్రైవేటు గార్డులు, మద్దతుదారులు, పార్టీ నేతలు .. గురువారం కోల్‌కతా పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో గొడవపడ్డారు. కామాక్ స్ట్రీట్ బిల్డింగ్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ జరిగింది. కోల్‌కతా పోలీసులు, మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నట్లు కేసులో పేర్కొన్నారు. బెదిరింపులకు కూడా పాల్గొన్నట్లు తెలిపారు. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్, హుమాయున్ కబీర్లపై కేసు బుక్ చేశారు. కేఎంసీ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదుల ఆధారంగా కూడా కేసులను నమోదు చేశారు. 13 మందిని అరెస్టు చేయగా, వారెవరన్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.