ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. (Raj Thackeray’s Son Defeat) ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ‘యువరాజు’గా పోటీ చేయలేదని తెలిపారు. మహారాష్ట్రతోపాటు ప్రజల కోసం పోరాడుతున్న ఒక సాధారణ కార్యకర్తనని అన్నారు. మహిమ్ స్థానం నుంచి పోటీ చేసిన 32 ఏళ్ల అమిత్ ఠాక్రే మూడో స్థానంలో నిలిచారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) అభ్యర్థి మహేష్ బలిరామ్ సావంత్ 1,316 ఓట్ల తేడాతో స్వల్ప విజయాన్ని దక్కించుకున్నారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వినమ్రంగా, గౌరవంగా స్వీకరిస్తున్నానని అమిత్ ఠాక్రే తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కష్టపడాలన్నది ఈ ఓటమి తనకు నేర్పిందని చెప్పారు. ‘నా ఈ యుద్ధం రాజకీయ అధికారం కోసం కాదు. ఎందుకంటే ఈ పోరాటం ఏ యువరాజుది కాదు. ఇది అందరి కోసం. మన ప్రజల కోసం, మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాడే ఒక సాధారణ కార్యకర్తను. మీ ముఖంలో సంతృప్తి చిరునవ్వు ఇవ్వాలని కోరుకున్నా’ అని అన్నారు. తన రాజకీయ ప్రయాణం ముగింపు కాదని, ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు.
మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు బలమైన శక్తిగా ఉన్న ఎంఎన్ఎస్ ప్రభావం గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తగ్గింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 13 సీట్లలో గెలిచింది. అయితే 2014, 2019 ఎన్నికల్లో ఒక్క స్థానానికి దిగజారింది. ఈసారి 125 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కేవలం 1.5 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీ సాధించింది.