తిరువనంతపురం: సాధించాలన్న తపన ఉంటే వయసుతోసహా ఏదీ అడ్డంకి కాదని వందేండ్లకు పైబడిన బామ్మ నిరూపించింది. అక్షరాస్యత పరీక్షలో వందకు 89 మార్కులు సాధించింది. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ పరీక్షను ఇటీవల నిర్వహించారు. కొట్టాయంకు చెందిన 104 ఏండ్ల వృద్ధురాలు కుట్టియయ్య ఈ పరీక్షలో వందకు 89 మార్కులు స్కోర్ చేశారు.
ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వాసుదేవన్ శివన్కుట్టి స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. కుట్టియమ్మ ఫొటోను కూడా అందులో పోస్ట్ చేశారు. ‘జ్ఞాన ప్రపంచంలోకి ప్రవేశించడానికి వయస్సు అడ్డంకి కాదు. అత్యంత గౌరవం, ప్రేమతో.. కుట్టియమ్మ, ఇతర కొత్త అభ్యాసకులందరికీ శుభాకాంక్షలు’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, 104 ఏండ్ల వృద్ధురాలు కుట్టియమ్మ ఇప్పటి వరకు స్కూలుకు వెళ్లలేదు. దీంతో ఆమె చదువుకోలేకపోయింది. అయితే, సాక్షరత ప్రేరక్ రెహనా కార్యక్రమం వల్ల చదవడం, రాయడం నేర్చుకున్నది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తన ఇంటిలోనే తరగతులకు హాజరైంది.
దీంతో నాల్గవ తరగతి పరీక్ష రాయడానికి కుట్టియమ్మ అర్హత పొందింది. కొట్టాయంలోని అయర్కున్నం పంచాయతీలో నిర్వహించిన ‘సాక్షరత’ పరీక్షకు హాజరైంది. తనకు వినికిడి సమస్య ఉన్నదని, సూచనల కోసం బిగ్గరగా మాట్లాడాలని ఇన్విజిలేటర్‌ను ఆమె కోరింది.
మరోవైపు కుట్టియమ్మ ఈ పరీక్షలో వందకు 89 మార్కులు సాధించిన విషయం వైరల్ అయ్యింది. దీంతో ఆమె స్థానికంగా పాపురల్ కావడంతోపాటు ఎందరికో ప్రేరణగా నిలిచారు. ‘చదువుకోవడంపై కుట్టియమ్మ అంకితభావానికి గౌరవంతో ఆమెకు నమస్కరిస్తున్నా. ఇది ఖచ్చితంగా ఇతరులకు స్ఫూర్తినిస్తుంది’ అని ఒక నెటిజన్ ప్రశంసించారు. ఆమె ఉన్నత విద్య అభ్యసించాలంటూ మరి కొందరు ఆకాంక్షించారు.
Joy of success! She proves beyond doubt that age is just a number. On this children's day, I wish this studios child with 104 years of experience. https://t.co/YG4aAYmTXY
— Sudarvizhi IPS (@sudarvanas) November 14, 2021