Kejriwal : కేంద్రంలోని నరేంద్రమోదీ (Narendra Modi) ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఓడితే అక్కడి ముఖ్యమంత్రిపైన, అక్కడి అధికార పార్టీ నేతలపైన పోలీసులు కేసులు పెట్టి వేధిస్తారని విమర్శించారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని, పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని, ఢిల్లీలో మా ప్రభుత్వాన్ని కేంద్ర సర్కారు అదేవిధంగా వేధిస్తున్నదని మండిపడ్డారు.
లిక్కర్ కేసులో తనను జైలుకు పంపించి ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయాలని చూశారని కేజ్రీవాల్ విమర్శించారు. కేజ్రీవాల్ ఇమేజ్ను దెబ్బకొట్టి, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. కానీ తాను భారత రాజ్యంగాన్ని రక్షించుకునే ప్రయత్నం చేశానని అన్నారు. అందుకే తనను జైల్లో పెట్టినా సీఎం పదవికి రాజీనామా చేయలేదని, తన పార్టీని దెబ్బతిననియ్యలేదని చెప్పారు.
జైల్లో నుంచి పరిపాలన చేయడమేంటని బీజేపీ నేతలు ప్రశ్నించారని, తప్పుడు కేసు బనాయించి, పైగా తన రాజీనామా కోసం డిమాండ్ చేశారని కేజ్రీవాల్ మండిపడ్డారు. కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన ఎందుకు చేయకూడదని స్వయంగా సుప్రీంకోర్టు కూడా కేంద్రాన్ని ప్రశ్నించిందని చెప్పారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చుననే విషయాన్ని సుప్రీంకోర్టు రుజువు చేసిందని కేజ్రీవాల్ అన్నారు.