బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ప్రతినిధులుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. కొందరు కాంట్రాక్టర్ల కార్యాలయాలు, ఇళ్లల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసి, బెంగళూరులోని ఓ కాంట్రాక్టర్ వద్ద భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో విలేకర్ల ప్రశ్నపై శివ కుమార్ స్పందించారు.
అంతకుముందు జేడీఎస్ నేత కుమార స్వామి, బీజేపీ నేత అశోక మాట్లాడుతూ, పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ నేతలు సొమ్ము వసూలు చేస్తున్నారని, ఈ సొమ్మును ఐదు రాష్ర్టాల శాసనసభ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.