న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, లారీలకు తప్పనిసరిగా ధ్వనిని వినిపించే పరికరాలను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) నుంచి శబ్దం వెలువడదు. ఫలితంగా ఇవి రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు పాదచారులు, ఇతర వాహనాలు వీటిని గుర్తించడం సాధ్యం కాదు. వెనుక నుంచి వాహనం వస్తున్నట్లు తెలుసుకోవడానికి వీలుగా అకొస్టిక్ వెహికిల్ అలర్టింగ్ సిస్టమ్ (AVAS)ను అమర్చాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొంది. 2026 అక్టోబరు 1 నుంచి తయారు చేసే ఎలక్ట్రిక్ ప్రయాణికుల, వస్తు రవాణా వాహనాలకు తప్పనిసరిగా ఏవీఏఎస్‌ను అమర్చాలని తెలిపింది.
ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు వంటి ప్రయాణికుల రవాణా వాహనాలు; ఎలక్ట్రిక్ లారీలు, గూడ్స్ వాహనాలు వంటి వాహనాల కొత్త మోడల్స్‌కు 2026 అక్టోబరు 1 నుంచి; ప్రస్తుత మోడల్స్‌కు 2027 అక్టోబరు 1 నుంచి ఏవీఏఎస్‌ను అమర్చాలని తెలిపింది. ఇవి ఏఐఎస్-173 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని చెప్పింది. ఏవీఏఎస్ ద్వారా కృత్రిమ శబ్దం వెలువడుతుంది. ఫలితంగా ఈ వాహనాలు వెళ్లే మార్గంలో ప్రయాణించే వారికి ఇవి వస్తున్నట్లుగా తెలుస్తుంది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ఇదిలావుండగా, హైబ్రిడ్ వాహనాల్లో ఏవీఏఎస్‌ను అమర్చాలని అమెరికా, జపాన్, కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే ఆదేశించాయి.