న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశంలో ఈ ఏడాది వరి పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నదనే అంచనాలు వినిపిస్తున్నాయి. వరి పంట అధికంగా వేసే ప్రాంతాల్లో సరిగా వర్షాలు కురవకపోవడంతో వరినాట్లు తగ్గడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఈ సీజన్లో వరి పంట విస్తీర్ణం 12 శాతం తగ్గింది. ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి దేశం మొత్తంగా వరి పంట సాగు విస్తీర్ణం 3.09 కోట్ల హెక్టార్లు ఉండగా… గత ఏడాది ఇదే సమయానికి ఇది 3.53 కోట్ల హెక్టార్లుగా ఉన్నదని శుక్రవారం తెలిపింది. అయితే ఇదే సమయంలో చెరకు సాగు విస్తీర్ణం 54.5 లక్షల హెక్టార్ల నుంచి 55.2 లక్షల హెక్టార్లకు పెరిగిందని పేర్కొన్నది. బియ్యం ఎగుమతిలో టాప్లో ఉండే భారత్.. గోధుమలు, చక్కెర మాదిరిగానే బియ్యం ఎగుమతులపై కూడా నియంత్రణలు విధించే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.