న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ చేత రాజీనామా చేయించడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వ్యంగ్యంగా స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం పదవి అంటే కుర్చీలాటలా ఉందని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ ( Derek O Brien ) విమర్శించారు. సీఎం అనే పదానికి ‘చెయిర్స్ మ్యూజికల్ (CM) – (కుర్చీలాట)’ అనే కొత్త అర్థం చెప్పుకునేలా బీజేపీ తీరు ఉందని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, గుజరాత్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే తాను స్వచ్ఛందంగా సీఎం పదవికి రాజీనామా చేశానని విజయ్ రూపానీ మీడియాతో చెప్పారు. విజయ్ రూపానీ రాజీనామాపై గుజరాత్ కాంగ్రెస్ సైతం స్పందించింది. ప్రజలే బీజేపీని అధికారం నుంచి తప్పించాలి అనుకుంటున్నారని, పేద ప్రజలు, రైతుల గోడు వినే ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నది.