న్యూఢిల్లీ: ఆస్తి రిజిస్ట్రేషన్ అనేది యాజమాన్య హక్కులు ఇవ్వబోదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. రిజిస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తి హక్కుకు మద్దతు ఇవ్వగలిగినప్పటికీ అది చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు, లేదా ఆస్తిపై నియంత్రణను సూచించదని సుప్రీం తీర్పు స్పష్టం చేసింది. యజమానులు, న్యాయవాదులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లపై సుప్రీం తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
అంతేకాదు, కోట్లాది మందికి చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం కూడా ఉన్నది. ఆస్తి రిజిస్ట్రేషన్, చట్టబద్ధమైన యాజమాన్యాన్ని కలిగి ఉండటం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఇది చూపిస్తున్నది. రిజిస్ట్రేషన్ అయిందంటే ఇక దానిపై యాజమాన్య హక్కులు వచ్చినట్టేనని గతంలో పరిగణించేవారు. అయితే, రిజిస్ట్రేషన్ అనేది విధానపరమైన ఒక ప్రక్రియ మాత్రమేనని, కానీ యాజమాన్యం అనేది ఆస్తిని ఉపయోగించడానికి, నిర్వహించడానికి, లేదా బదిలీ చేయడానికి చట్టబద్ధమైన హక్కును సూచిస్తుందని సుప్రీం తీర్పు వివరిస్తున్నది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాజమాన్యాన్ని కచ్చితంగా నిరూపించేందుకు సమగ్రమైన డాక్యుమెంటేషన్ అవసరం. ఆస్తి వివాదాల పరిష్కారానికి న్యాయ పరిష్కారమే కేంద్రంగా ఉండాలి. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా అవి చట్టబద్ధమని నిరూపించుకోవాల్సిన ప్రాముఖ్యతను సుప్రీం తీర్పు నొక్కి చెప్తున్నది. ఆస్తి పత్రాలను చట్టపరంగా ధ్రువీకరించుకోవాలని, యాజమాన్యం, రిజిస్ట్రేషన్ సమస్యలపై స్పష్టత కోసం న్యాయనిపుణులను సంప్రదించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తున్నది.
అలాగే, మారుతున్న ఆస్తి చట్టాలు, కోర్టు తీర్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కూడా స్పష్టం చేస్తున్నది. డెవలపర్లు, కొనుగోలుదారులు, న్యాయవాదులు ఇప్పుడు మరింత స్పష్టమైన చట్టపరమైన వ్యవస్థలో పనిచేయాల్సి ఉంటుంది. ఇది ఆస్తి లావాదేవీలపై నమ్మకాన్ని పెంచే అవకాశం ఉన్నది. యాజమాన్య హక్కుల ప్రాముఖ్యత పెరగడంతో ఆస్తుల విలువపైనా ప్రభావం చూపుతుంది. సుప్రీంకోర్టు తీర్పు దేశంలోని ప్రస్తుత ఆస్తి చట్టాలను సమీక్షించేందుకు దారితీసే అవకాశం ఉన్నది.