న్యూఢిల్లీ: ఇండస్ట్రియల్ ఆల్కహాల్ (స్పిరిట్) ఉత్పత్తి, తయారీ, సరఫరాపై నియంత్రణ అధికారం రాష్ర్టాలకే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనంలో ఎనిమిది మంది అనుకూలంగా, ఒకరు మాత్రమే వ్యతిరేకంగా ఈ తీర్పును వెలువరించారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో పేర్కొన్న రాష్ర్టాల జాబితాలోని 8వ అంశంలో పేర్కొన్న ‘మత్తు కలిగించే మద్యం’లోనే పారిశ్రామిక మద్యం (స్పిరిట్) కూడా ఇమిడి ఉంటుందని వివరించింది. ధర్మాసనంలోని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, అభయ్ ఓకా, జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రా, ఉజ్జల్ భూయాన్, సతీశ్ చంద్ర శర్మ, అగస్టీన్ జార్జ్ మసీహ వెలువరించిన తీర్పుతో జస్టిస్ బీవీ నాగరత్న విభేదించారు. 95 శాతం ఇథనాల్ ఉంటే ఇథైల్ ఆల్కహాల్‌ను పారిశ్రామిక మద్యం అని అంటారు. దీనిని మత్తుపానీయంగా వినియోగించడం సాధ్యం కాదు.