న్యూఢిల్లీ, జనవరి 13: ప్రభుత్వ అధికారిపై విచారణ జరిపేందుకు పై అధికారి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరన్న అవినీతి నిరోధక చట్టం(పీసీఏ)లోని సెక్షన్ 17ఏ రాజ్యాంగ బద్ధతపై సుప్రీంకోర్టు మంగళవారం భిన్న తీర్పులు వెలువరించింది. ఈ నిబంధన అవినీతిపరులను పరిరక్షించే ప్రయత్నంగా అభివర్ణించిన జస్టిస్ బీవీ నాగరత్న ప్రభుత్వ అధికారిపై దర్యాప్తు జరిపేందుకు పై అధికారి నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదని తీర్పు చెప్పారు.
కాగా జస్టిస్ కేవీ విశ్వనాథన్ మాత్రం ఈ సెక్షన్ని కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికారిని విచారించాలా వద్దా అన్న విషయంపై లోక్పాల్ లేదా లోకాయుక్త నిర్ణయించాల్సి ఉంటుందని జస్టిస్ విశ్వనాథన్ తెలిపారు. సెక్షన్ 17ఏ చట్టవ్యతిరేకంగా లేదని, దాన్ని రద్దు చేయవలసిన అవసరం కనపడడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై భిన్న తీర్పులు వెలువడిన దృష్ట్యా దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించనున్నారు.