న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: భారత్‌లాంటి లౌకిక దేశంలో మత విద్వేష నేరాలకు చోటు లేదని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. విద్వేష ప్రసంగాలపై రాజీ పడే ప్రస్తకే లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తిస్తేనే పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపింది. ఇలాంటి విద్వేష నేరాల నుంచి తన పౌరులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని చెప్పింది. 2021 జూలై 4న తాను నోయిడా నుంచి అలీగఢ్‌కు వెళ్తున్నప్పుడు తనపై ఓ గ్యాంగ్ దాడి చేసి దూర్భాషలాడిందని ఓ ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ ఘటనలో కేసు నమోదు చేయడానికి పోలీసులు ఆసక్తి చూపలేదని పిటిషనర్ తెలిపాడు. ‘ఓ వ్యక్తి తన గడ్డం లాగి తనను మతం పేరిట దూర్భాషలాడారని పోలీసులకు తెలియజేసిన తర్వాత కూడా ఫిర్యాదు నమోదు చేయకపోతే అది సమస్యే’ అని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రతి అధికారి చట్టాన్ని గౌరవించాలని, లేదంటే ప్రతి ఒక్కరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించారు. 8 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తగిన చర్యలు తీసుకున్నామని యూపీ ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎమ్ నటరాజ్ కోర్టుకు తెలిపారు.